మా కుమార్తె కేసులో న్యాయం చేయండి.. జగన్‌ను వేడుకున్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు!

  • 2017లో హత్యాచారానికి గురైన సుగాలి ప్రీతి
  • తమకు న్యాయం జరగలేదన్న ప్రీతి తల్లిదండ్రులు
  • కేసును పక్కన పెట్టేశారని ఆవేదన
  • అండగా ఉంటామని భరోసా ఇచ్చిన జగన్

గత తొమ్మిదేళ్లుగా తమ కుమార్తె కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయక్‌లు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ను కలిసి తమ ఆవేదనను పంచుకున్నారు. 2017లో తమ కుమార్తెపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేశారని.. ఇన్నేళ్లు గడుస్తున్నా తమకు ఇంకా న్యాయం జరగలేదని వారు జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు.


ఆనాడు వైసీపీ ప్రభుత్వం తమ కుటుంబానికి కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అండగా నిలిచిందని చెప్పారు. అయితే, ప్రస్తుతం ఈ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారని ఆరోపించారు. అంతేకాకుండా, తమకు రావాల్సిన పెన్షన్‌ను కూడా స్థానిక అధికారులు నిలిపివేశారని, కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు సాయం అడిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ విచారణ వేగవంతమయ్యేలా తమకు న్యాయ సహాయం అందించాలని వారు కోరారు.


బాధిత తల్లిదండ్రుల గోడును సావధానంగా విన్న జగన్, సుగాలి ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ తరపున లీగల్ సపోర్ట్ ఇస్తామని, భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా కల్పించారు.


Sugali Preethi
YS Jagan
Sugali Preethi case
Andhra Pradesh
Justice for Preethi
Parvathi
Raju Naik
Crime news
CBI investigation
Kurnool

More Telugu News